డా.జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారు 1925 అక్టోబర్‌ 20 న అనంతపురంజిల్లా రాయదుర్గంలో జన్మించారు. శ్రీమతి జానకమ్మ శ్రీ సుబ్రహ్మణ్యశాస్త్రిలు వీరి తల్లిదండ్రులు. ఎం.ఏ.ఇంగ్లీషు, ఎం.ఏ.తెలుగు, బిఇ.డి, రాష్ట్ర విశారద వంటి కోర్సులు అభ్యసించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వీరిని గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. పాఠశాల ఉపాధ్యాయుడుగా, పాఠశాలల పరిశీలకుడుగా సర్వే అధికారిగా, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకులుగా డా.శాస్త్రిగారు పనిచేశారు.

చిన్నవయస్సులోనే డా.శాస్త్రిగారు ప్రపంచ ప్రసిద్ధిచెందిన వ్యక్తుల ప్రభావానికి లోనయ్యారు. ఆయన ఆరాధించిన వ్యక్తులతో కలసిపనిచేయడం ఆయన అదృష్టం. డా.బళ్ళారి రాఘవగారి పరిచయం ఆయనకు నటనలో అవకాశం కల్పించింది. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారితో కలసి ఆయన తెలుగు ప్రసంగాలను కన్నడంలోకి అనువదిస్తూ డా.శాస్త్రిగారు జాతీయోద్యమంలో భాగస్వాములయ్యారు. అనేక సాహితీ సమావేశాల నిర్వహణ ద్వారా ఆయన తెలుగు సాహిత్య ప్రేమికుల స్నేహితుడయ్యారు. కరుణశ్రీ, బోయి భీమన్న, దాశరథి, పురిపండ అప్పలస్వామి, పుట్టపర్తి నారాయణాచార్యులు, శ్రీ శ్రీ, బంగోరె, డా.బెజవాడ గోపాలరెడ్డి మొదలైన ప్రసిద్ధులైన సాహితీమూర్తులతో ఆయనకు సాన్నిహిత్యం ఉంది. 1973-93 మధ్య డా.శాస్త్రిగారు కడపజిల్లా రచయితలసంఘం కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశారు. కవిసమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణగారితో ఆయనకు మంచిస్నేహం ఉండేది. సంఘసేవ పరాయణత్వంలో డా.శాస్త్రిగారు ఎంతోమంది ఉన్నతాధికారులతో సంబంధాలు పెట్టుకున్నారు. కడపజిల్లా రచయితలసంఘం కార్యదర్శిగా డా.మల్లెమాల వేణుగోపాలరెడ్డి గారి అధ్యక్షతలో డా.శాస్త్రిగారు కడపపట్టణంలోనే కాకుండా తాలూకాలలోకూడా అనేక కార్యక్రమాలు నిర్వహించారు.

డా.శాస్త్రి గారు సి.పి.బ్రౌన్‌ ఆరాధకుడు. ఆయన జీవితాన్ని తెలుగు భాషా సముద్ధారకుడైన సి.పి.బ్రౌన్‌ స్మారక కార్యక్రమ నిర్వహణకోసం అంకితంచేశారు. అనేక సంవత్సరాలు మదనపడి తన జీవితకాల స్వప్నమైన సి.పి.బ్రౌన్‌ స్మారకగ్రంథాలయ స్థాపనలో డా.శాస్త్రిగారు విజయం సాధించారు. దీనికి వారు వ్యవస్థాపక కార్యదర్శి. ఇది వారి జీవితసాఫల్యానికి సంకేతం. ఇందుకు ఆయన చిరస్మరణీయుడు. సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం ఇప్పుడు యోగి వేమన విశ్వవిద్యాలయంలో భాగంగా ఉన్నది. డా.శాస్త్రిగారి నిర్విరామ తెలుగు భాషా సాహిత్యసేవను గుర్తించి జ్ఞానపీఠ పురస్కార్‌ గ్రహీత డా.సి.నారాయణరెడ్డి గారు వారిని 'బ్రౌన్‌శాస్త్రి' బిరుదుతో సత్కరించారు. తనకెన్ని సత్కారాలు జరిగినా ఈ బిరుదు తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని శాస్త్రిగారు చెప్పుకున్నారు.

డా.శాస్త్రిగారికి ప్రతిష్ఠాత్మకమైన ఎన్నో పురస్కారాలు లభించాయి. 1999 జనవరి 3 న శ్రీశ్రీశ్రీ విశ్వేశ్వరతీర్థ శ్రీపాదులవారు ప్రసాదించిన ధార్మికసేవాధురీణ, విశాఖపట్నంలోని ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ గారి లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ వారి లోక్‌నాయక్‌ 2012 పురస్కారం(దీనికి ఆంధ్రజ్ఞానపీఠ పురస్కారం అనికూడా పేరు) వంటివి వీరికి లభించిన పురస్కారాలలో కొన్ని. సుదీర్ఘమైన సాహితీ, సాంస్కృతిక జీవితంగల డా.జానమద్ది హనుమచ్ఛాస్త్రిగారు తన 90 వ ఏట 2014 ఫిబ్రవరి 28 న స్వర్గస్థులైనారు.