- తెలుగు పునరుజ్జీవన పితామహుడుగా పేరుపొందిన సి.పి.బ్రౌన్ పూర్తిపేరు ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్. ఈయన తూర్పు ఇండియా కంపెనీ ఉద్యోగిగా 1820లో కడపజిల్లా కలెక్టర్‌కు సహాయకుడుగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించాడు. ఈయన కడపలో 15 ఎకరాల తోటను ఒక బంగ్లాతో సహా 3,000 వరహాలకు కొన్నాడు. ( ఒక వరహా అంటే ఆ రోజుల్లో 4 రూపాయలుతో సమానం) తెలుగు సాహిత్యానికి సేవచేయడానికై ఆయన ఈ తోటను కొన్నాడు. ఆ స్థలాన్ని బ్రౌన్ కాలేజ్ అని ఆ రోజుల్లో పిలిచేవారు. సి.పి.బ్రౌన్ తెలుగు భాషా సాహిత్యాల సముద్ధరణకోసం కట్టించిన భవన శిథిలాలమీద నేటి సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం ఆవిర్భవించింది.
- శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని తెలుగుశాఖ 1974 లో సి.పి.బ్రౌన్ పరిశోధనా పథకాన్ని ప్రారంభించింది. దీనికి ఆచార్య జి.ఎన్.రెడ్డి అధ్యక్షుడు కాగా బంగోరె(బండి గోపాలరెడ్డి) పరిశోధకుడుగా ఉండేవారు. ఈ ఇద్దరు లండన్‌లో ఉండినటువంటి వేల పుటల వ్రాతప్రతులను తెప్పించారు. దాదాపు 20 సంపుటాల లేఖలు తెప్పించారు. ఈ ప్రాజెక్టు నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి పదిహేనువేల రూపాయల గ్రాంటును మంజూరుచేసింది. ఈ పథకం క్రింద శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం 1974-77 మధ్య నాలుగు పుస్తకాలను ప్రచురించింది. అవి. 1.బ్రౌన్ జాబుల్లో స్థానిక చరిత్ర శకలాలు, కడప జాబుల సంకలనం 2.ఆంధ్రగీర్వాణ ఛందము 3.సి.పి.బ్రౌన్ స్వీయచరిత్ర 4.సి.పి.బ్రౌన్ లేఖలు-తెలుగు జర్నలిజం చరిత్ర .
- ఆచార్య జి.ఎన్.రెడ్డి, బంగోరెలు తమ పరిశోధనలో భాగంగా కడపకు అనేక పర్యాయాలు వచ్చారు. బ్రౌన్, రచనలు ఆయన స్వీయచరిత్ర ఆధారంగా ఒక పర్యాయం సి.పి.బ్రౌన్ నివసించిన స్థలాన్ని వాళ్ళు గుర్తించారు. తరువాత వాళ్ళు అప్పటి జిల్లా కలెక్టరు డా.పి.ఎల్.సంజీవరెడ్డి గారిని కలుసుకొని సి.పి.బ్రౌన్ తెలుగు సాహిత్యానికి సేవచేసిన స్థలంలో ఒక గ్రంథాలయాన్ని స్థాపించాలని కోరారు. ప్రసిద్ధ అభ్యుదయ కవి శ్రీ ఆరుద్రగారు వాళ్ళ కోరికను సమర్థించారు. జిల్లా కలెక్టరు డా.పి.ఎల్.సంజీవరెడ్డిగారు అప్పటి సి.పి.బ్రౌన్ నివసించిన స్థల యజమాని శ్రీ సి.ఆర్.కృష్ణస్వామి గారి నుండి 20 సెంట్ల స్థలాన్ని విరాళంగా పొందడంలో విజయం సాధించారు. గ్రంథాలయ నిర్మాణం పనిని అప్పటి కడపజిల్లా రచయితల సంఘం అధ్యక్షకార్యదర్శులైన డా.మల్లెమాల వేణుగోపాలరెడ్డి గారికి, శ్రీ జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారికి అప్పజెప్పారు.
- 1976 నుండి శ్రీ జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారు ఆర్థిక సహాయంకోసం అనేక పర్యాయాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయన కృషి ఫలితంగా 1986లో స్థలదాత శ్రీ సి.కె.సంపత్‌కుమార్ గారు (సి.ఆర్.కృష్ణస్వామిగారి కుమారుడు) అధ్యక్షుడుగా, జిల్లా కలెక్టర్ ప్రధాన పోషకుడుగా, జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారు కార్యదర్శిగా సి.పి.బ్రౌన్ స్మారక ట్రస్టు ఆవిర్భవించింది.
- 1987 జనవరిలో శ్రీ జంధ్యాల హరినారాయణ గారు జిల్లా కలెక్టరుగా వచ్చారు. ఆయన గ్రామీణ క్రాంతిపథం నిధులనుండి మూడున్నర లక్షల రూపాయలు ట్రస్టుకు మంజూరుచేశారు. 1987 జనవరి 22 న గ్రంథాలయ భవనానికి పునాది వేయబడినది. ఈ కార్యక్రమానికి సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు గారు అధ్యక్షులుగా ఉన్నారు. కడప పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షులు శ్రీ జి.కృష్ణమూర్తి గారు ఆ సంస్థనుండి మొదటి దఫాగా 43,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. గ్రంథాలయ భవన నిర్మాణం పని వేగవంతంగా జరిగినా నిధుల కొరతవల్ల కొన్ని నెలలు ఆగిపోయింది. అప్పుడు కడపజిల్లా కలెక్టరుగా వచ్చిన శ్రీ ఎ.కె.పరీడ గారు కస్తూర్బాగాంధీ శతజయంతి నిధులనుండి 60,000 రూపాయలు మంజూరుచేశారు. ప్రొద్దుటూరుకు చెందిన కొంతమంది దాతలు కూడా సహృదయంతో విరాళాలు ఇచ్చారు. కడప, ప్రొద్దుటూరు పట్టణాలలోని ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఒక్కొక్కరు ఒక రూపాయి వంతున 26,000 రూపాయలు సేకరించి అందజేశారు. ఈ సమయంలో పాఠశాల విద్యాప్రాంతీయ సంచాలకులు శ్రీ ఎమ్.రామస్వామిరెడ్డి గారు, జిల్లా విద్యాశాఖాధికారి డా.సత్యనారాయణ గారు నిధుల సేకరణలో విద్యార్థులను ప్రోత్సహిస్తూ అభినందనీయమైన పాత్రల్ని నిర్వహించారు. తరువాత వచ్చిన జిల్లా కలెక్టర్లు శ్రీమతి చందనాఖన్, డా.పి.సుబ్రహ్మణ్యం మరికొందరి దాతల సహాయంతో ప్రహరీగోడ నిర్మాణం పూర్తైంది. అలాగే శ్రీ సంకటి నరసింహారెడ్డి గారి ఆర్థిక సహాయం వల్ల ప్రధాన ప్రవేశ ద్వారం నిలబెట్టగలిగాం.
- 1927 లో కడపపట్టణానికి సమీపంలోగల వల్లూరు గ్రామవాసి శ్రీ పోలేపల్లి వెంగన్న శ్రేష్ఠిగారు ఆ గ్రామంలో సీతారామచంద్ర గ్రంథ భాండాగారం స్థాపించారు. ఆయన వయసు పైబడటంవల్ల 2,500 పుస్తకాలుగల తన గ్రంథాలయాన్ని సి.పి.బ్రౌన్ స్మారక గ్రంథాలయానికి దానం చేశారు. కాలక్రమంలో విశాలాంధ్ర విజ్ఞాన సమితి, ఆంధ్రవిశ్వకళాపరిషత్, వావిళ్ళ రామస్వామిశాస్త్రి అండ్ సన్స్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, దివ్యజ్ఞాన సమాజం(వారణాసి) వంటి అనేక ప్రసిద్ధ పుస్తక సంస్థలు పెద్ద సంఖ్యలో గ్రంథాలను విరాళంగా ఇచ్చాయి. అలాగే డా.చల్లా రాధాకృష్ణశర్మ, డా.సర్దేశాయి తిరుమలరావు, డా.పుట్టపర్తి నారాయణాచార్యులు, డా.బెజవాడ గోపాలరెడ్డి, శ్రీ సి.అన్నారావు, డా.కొంగర జెగ్గయ్య, డా.పొత్తూరి వెంకటేశ్వరరావు, డా.ద్వానా శాస్త్రి, డా.నాగసూరి వేణుగోపాల్, ఆచార్య బిరుదురాజు రామరాజు, శ్రీ కోడూరు పుల్లారెడ్డి, శ్రీ కె.జనార్ధన, ఆచార్య శమంతకమణి, శ్రీ ఎస్.జయరామిరెడ్డి, శ్రీమతి మాలతీ చందూర్, శ్రీ కె.గంగిరెడ్డి వంటి అనేకమంది విద్వాంసులు వారి వారసులు వాళ్ళ గ్రంథాలయాలను సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రానికి స్వాధీనం చేశారు. వీరితోపాటు ఆనందబుద్ధ విహారట్రస్టు, చిన్మయామిషన్, తెలుగు అకాడమీ వంటి ఇతర సంస్థల వారు కూడా అనేక పుస్తకాలను అందించారు. అనేకమంది రచయితలు, పరిశోధకులు కూడా వాళ్ళు సేకరించిన పుస్తకాలను గ్రంథాలయానికి అందించారు. .
- కడపజిల్లా కలెక్టరు శ్రీ కె.వి.రమణాచారిగారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వ ముఖ్యకార్యదర్శి శ్రీ కె.జయభారత రెడ్డి గారు (కడప కోటిరెడ్డిగారి కుమారుడు), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వంలో విద్యాశాఖ కార్యదర్శి శ్రీధరశర్మ వంటివారి సహాయంతో సి.పి.బ్రౌన్ ట్రస్టు నిర్వహణకోసం ఐదు లక్షల రుపాయల కార్పస్ ఫండ్ సేకరించగలిగాం.
- 1998 లో కడపజిల్లా జాయింట్ కలెక్టరు శ్రీ ఎ.గిరిధర్ గారు వారి తర్వాత వచ్చిన శ్రీ వి.నాగిరెడ్డి గారు అందించిన ఆర్థిక సహాయంతో మొదటి అంతస్థులో సమావేశ మందిరాన్ని నిర్మించగలిగాం. డా.బి.శ్రీరామమూర్తి, డా.కనుపర్తి రాధాకృష్ణ, శ్రీ ఎ.గంగిరెడ్డి గార్లు ఒక్కొక్కరు 25,000 రూపాయల చొప్పున చేసిన ఆర్థికసహాయంతో పరిశోధకుల సౌకర్యంకోసం మూడు గదులను నిర్మించాం. రీజన్సీ సిరమిక్స్ యజమాని డా.జి.ఎన్.నాయుడుగారు 75,000 రూపాయల విలువచేసే సిరమిక్ టైల్స్‌ను విరాళంగా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరక్టెర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ హెచ్.జె.దొర,ఐ.పి.ఎస్‌గారు, కడపజిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ గోవింద్‌సింగు, ఐ.పి.ఎస్ గారు 50,000 రూపాయల విలువచేసే కుర్చీలు, బల్లలు విరాళంగా ఇచ్చారు. పుస్తకాలు,సామగ్రి కొనడానికి కలకత్తాలోని రాజారామ్మోహన్‌రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ మూడు దఫాలలో 1,50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించింది.
- ఆచార్య సి.ఆదినారాయణరెడ్డి వారి శ్రీమతి శశికళగార్లు వారికుమార్తె సుమబాలరెడ్డి స్మారకనిధిగా 50,000 రూపాయలు అందించారు. ఆ డబ్బుతో సుమబాల పేరుతో బాలల గ్రంథాలయ విభాగం ఏర్పాటుచేశాం.
- జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, రాజ్యసభ సభ్యులు, పద్మభూషన్ ఆచార్య సి.నారాయణరెడ్డి గారు పార్లమెంట్ సభ్యుల నిధి నుండి సహృదయంతో పది లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఈ నిధితో డా.సి.నారాయణరెడ్డి పరిశోధనకేంద్రం పేరుతో రెండవ అంతస్థును నిర్మించాం. దీనికి డా.తక్కోలు మాచిరెడ్డి గారు, డా.పి.సంజీవమ్మ గారు 50,000 రూపాయల విరాళం అందించారు. ఈ పరిశోధన కేంద్రాన్ని ఆచార్య సి.నారాయణరెడ్డి గారు 2003 నవంబర్ 9 న ప్రారంభించారు.
- ప్రస్తుతం ఈ భాషా పరిశోధన కేంద్రంలో 40,000 తెలుగు పుస్తకాలు, 20,000 ఇంగ్లీషు పుస్తకాలు, 5,000 హిందీ పుస్తకాలు, 500 సంస్కృత గ్రంథాలు, 250 కన్నడ గ్రంథాలు, 250 తమిళ గ్రంథాలు, 50 ఉర్దూ గ్రంథాలు మొత్తం 66,050 పుస్తకాలు అందుబాటులో పెట్టాం. అలాగే 3,000 ప్రత్యేక సంచికలు, బాలల విభాగంలో 500 పుస్తకాలు ఉన్నాయి. మద్రాసులోని ప్రభుత్వ ప్రాచ్య లిఖిత గ్రంథాలయం నుండి 42 సంపుటాల మెకంజీ కైఫీయత్తుల ప్రతులను సేకరించాం. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తీసుకొచ్చిన 17 సంపుటాల సి.పి.బ్రౌన్ గ్రంథాలను కూడా సంపాదించాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సర్వీసులో పనిచేసిన శ్రీ జె.పి.ఎల్.గ్విన్ ఐ.సి.ఎస్. గారు ఉద్యోగవిరమణచేసి బ్రిటన్‌కు వెళ్ళిన తర్వాత సి.పి.బ్రౌన్ రచించిన ఇంగ్లీషు-తెలుగు, తెలుగు-ఇంగ్లీషు నిఘంటువుల తొలి ప్రతులను సంపాదించి పంపించారు. అలాగే ఆయన తన వంతుగా 1,115 రూపాయలు సహాయం చేశారు. సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో పరిశోధకులకు అందుబాటులో ఈ క్రింది గ్రంథాలు లభిస్తాయి.
- తెలుగు,ఇంగ్లీషు, సంస్కృత భాషల నిఘంటువులు దాదాపు 60 ఉన్నాయి. దాదాపు 30 సంపుటాల విజ్ఞానసర్వస్వాలు లభిస్తాయి. అలాగే 30 సంపుటాల ఎన్సైక్లోపీడియా బ్రిటానికా, 5 సంపుటాల భారతదేశంలో కులాలు, జాతులు, 80 సంపుటాల ఆంధ్రసాహిత్య పరిషత్ పత్రికలు, 100 సంపుటాల గాంధేయ సాహిత్యం, అముద్రిత గ్రంథ చింతామణి, 1928 నాటి సమదర్శిని 4 సంపుటాలు మొదలైనవి. అలాగే డా.జానమద్ది హనుమచ్ఛాస్త్రి, డా.పుట్టపర్తి నారాయణాచార్యులు, ఆచార్య దివాకర్ల వేంకటావధాని, శ్రీ దుర్భాక రాజశేఖశతావధాని మొదలైనవారి వ్రాతప్రతులు, బ్రౌన్‌కు సంబంధించిన పుస్తకాలు 50, వేమన పద్యసంకలనాలు, విమర్శ గ్రంథాలు, శ్రీ రామకృష్ణ పరమహంస, వివేకానంద రచనల సంపుటాలు, వందలకొలది నవలలు, నాటకాలు, కథానికా సంపుటాలు, కవిత్వ సంపుటాలు. ఇవీకాక చరిత్ర, రాజనీతి, సామాజిక శాస్త్రం, మనోవైజ్ఞానికశాస్త్రం మొదలైన విభాగాలకు చెందిన గ్రంథాలు ఉన్నాయి. 180 తాళపత్రగ్రంథాలు శుద్ధిచేయబడి ఉన్నాయి. అలాగే హెరిటేజ్, ఇమ్‌ప్రింట్ స్పాన్, అమెరికన్ రెవ్యూ, ఆంధ్రపత్రిక ఉగాది సంచికలు, ఆంధ్రప్రభ, భారతి మొదలైన పత్రికలు ఉన్నాయి. కడపజిల్లా ఎపిగ్రాఫ్‌లు, జిల్లా గెజిటీర్‌లు, జ్యోతిష మొదలైన శాస్త్ర గ్రంథాలుకూడా ఈ గ్రంథాలయంలో లభిస్తాయి. విద్యార్థులకు, ఉద్యోగార్థులకు అవసరమైన పోటీ పరీక్షలకు ఉపయోగపడే గ్రంథాలుకూడా ఉన్నాయి.
- సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం దిన,వార,పక్ష, మాస పత్రికలను దాదాపు 100 పత్రికలను తెప్పిస్తున్నది. నేషనల్ ఆర్కైవ్స్ వారి ఆర్థిక సహాయంతో సి.పి.బ్రౌన్ ట్రస్ట్ 2002 లో కడపజిల్లా మెకంజీ కైఫీయత్తుల మొదటిసంపుటం ప్రచురించింది. తర్వాత మరో ఆరు సంపుటాలు ప్రచురించింది. ఎనిమిదవ సంపుటం ముద్రణలో ఉన్నది. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రాన్ని గుర్తించాయి.
- 2005 లో ప్రభుత్వం స్వాధీనం చేసుకునే దాకా గ్రంథాలయ అభివృద్ధి, నిర్వహణ స్వచ్ఛంద సంస్థలు, దాతలు, ప్రభుత్వంచేసిన ఆర్థిక సహాయంతోనే ఈ సంస్థ నిర్వహింపబడింది. 2005 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా వార్షికపద్దును పదిహేను లక్షలుగా మంజూరుచేసింది. 2006 లో ఈ పద్దును ముప్పై లక్షలకు పెంచింది. 2005 అక్టోబర్ 1 నాటికి సి.పి.బ్రౌన్ స్మారక ట్రస్టు రద్దై శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి అనుబంధం చేయబడింది. 2006 నవంబర్ 1 న యోగి వేమన విశ్వవిద్యాలయానికి అనుబంధ సంస్థగా మార్చబడింది. 1990 దాకా సి.పి.బ్రౌన్ స్మారక ట్రస్టు గ్రంథాలయంగానే కొనసాగింది. ఆ తర్వాత సి.పి.బ్రౌన్ ప్రాంతీయ భాషా సాహిత్య పరిశోధన కేంద్రంగా పేరుమార్చుకొని మెకంజీ కైఫీయత్తుల ప్రచురణ ప్రారంభించింది. యోగి వేమన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా చేయబడిన తర్వాత సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంగా పేరు మార్చబడింది.
పుస్తకాల సేకరణ:
సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం విశేషాలు:
నిధులు-అభివృద్ధి :
పరిశోధకులకు అందుబాటులో సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం
క్రమ సంఖ్య | పరిశోధకులు | చిరునామా | సిద్దాంత గ్రంధం |
---|---|---|---|
1 | డా.మూలె రామముని రెడ్డి | (రిటైర్ట్ టీచర్), ప్రొద్దుటూరు | కడపజిల్లా భజన పాటలు - ఒక పరిశీలన |
2 | డా. మూల మల్లికార్జున రెడ్డి అసిస్టెంట్ ప్రొఫెసర్ | శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి తాత్విక దార్శనికత | లలితకళల విభాగం యోగి వేమన విశ్వవిద్యాలయం |
3 | డా. భూతపురి గోపాలకృష్ణశాస్త్రి జూనియర్ రీసర్చ్ అసిస్టెంట్ | గడియారం వారి చారిత్రక కావ్యాలు | సి.పి. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం |
4 | డా. ఆర్. రాజేశ్వరమ్మ | అసోసియేట్ ప్రొఫెసర్ | కడప జిల్లా కథా సాహిత్యం-పరిశీలన తెలుగు శాఖ, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం |
5 | లక్ష్మీరామ నాయక్ | డిప్యూటీ రిజిస్ట్రార్ | మాసీమ పత్రికా సాహిత్యం- ఒక అధ్యయనం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనంతపురం |
6 | డా. యం. పార్వతి | ఉపాధ్యాయురాలు ,కడప | రాయలసీమ కథల్లో రైతు చిత్రణ |
7 | డా. ఆర్. సత్యనారాయణ | ఉపాధ్యాయుడు, కడప | శ్రీ భూతపురి సుబ్రహ్మణ్యశర్మగారి ్రీకృష్ణభారతం-సమగ్ర పరిశీలన |
8 | డా. ఖాజా | హైదరాబాదు | తెలుగు ఉర్దూ కథానికల్లో ముస్లి జీవిత చిత్రణ |
9 | డా. పి.నాగరాజు | కడప | రాయలసీమ నవల - తొలి థ : ఒక అధ్యయనం |
10 | డా.టి. వెంకటయ్య | కడప | రాయలసీమ కథానిక తొలి థ (1918-1980) : ఒక పరిశీలన |
11 | డా. జి.రవికుమార్ | కడప | రాయలసీమ ఆధునిక పద్య కవిత్వం - ఒక పరిశీలన |
12 | శ్రీ సి. శివారెడ్డి | కడప | శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలంలోని ప్రాచ్యపరిశోధన సంస్థ-సంస్కృత సాహిత్య సేవ |
13 | శ్రీ రాజశేఖర్ | కడప | - |
ఉదయం : 9.00 గం. - 12.00 గం.
సాయంత్రం : 4.00 గం. - 7.00 గం.
సెలవుదినం : గురువారం.
ప్రస్తుతం సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో శాశ్వత సభ్యత్వం రుసుం 500 రూపాయలు. ఈ సంస్థలో 2014 నవంబర్ నాటికి 650 మంది శాశ్వత సభ్యులుగా ఉన్నారు..